Perni Nani: పరారిలో పేర్ని నాని, అరెస్ట్ ఖాయమేనా..?

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ని అరెస్టు చేయడం దాదాపుగా ఖాయంగా కనబడుతోంది. ఇటీవల పామర్రులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. సినిమా డైలాగులను వాడుతూ చీకట్లో కన్ను కొట్టాలంటూ ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసు వర్గాలు ఆయనపై పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు కూడా నమోదు చేశాయి. పలు ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు.
దీనితో నానిని అరెస్టు చేయడం ఖాయమని అందరూ భావించారు. పరిస్థితి అర్థం చేసుకున్న నాని వెంటనే హైకోర్టు(High Court)లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు కాకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు నాని. అయితే ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇక బెయిల్ పిటిషన్ పై విచారణను 22వ తారీకుకు వాయిదా వేసింది హైకోర్టు. ఈలోపు ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీనితో తనను తాను రక్షించుకునేందుకు నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అయినా సరే వైసీపీ(YSRCP) నాయకులకు గానీ సన్నిహితులకు గాని అందుబాటులో లేకుండా నాని ఎస్కేప్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మిథున్ రెడ్డి కూడా ఇలాగే అరెస్టయ్యారు. హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. కోర్ట్ కొట్టేసింది. దీనితో సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురయింది.
ఇప్పుడు నానిని భయపెడుతున్న విషయం కూడా ఇదే అంటున్నాయి వైసిపి వర్గాలు. అగ్ర నేతనే అరెస్టు చేస్తే తాము ఎంత అనే భావనలోనే నాని ఉన్నట్లుగా సమాచారం. అందుకే తనను తాను రక్షించుకోవడానికి నాని అజ్ఞాతానికి వెళ్ళినట్లు సమాచారం. ఒకవేళ హైకోర్టు బెయిల్ ఇస్తే బయటకు రావాలని నాని భావిస్తున్నారట. లేదంటే మాత్రం అజ్ఞాతంలోనే ఉండేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.