Tadipatri: పెద్దారెడ్డికి 24 గంటల్లోనే పోలీస్ నోటీసులు.. తాడిపత్రిలో హై టెన్షన్..

తాడిపత్రి (Tadipatri) రాజకీయాలు ఏపీలో మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ (YCP) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతితో శనివారం రోజు పట్టణంలో అడుగుపెట్టగా, కేవలం 24 గంటలు గడవక ముందే పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పర్యటన పూర్తయ్యాక మళ్లీ రావాలని సూచిస్తూ, తాత్కాలికంగా పట్టణాన్ని విడిచిపెట్టాలని ఆదేశించారు.
గత 16 నెలలుగా తాడిపత్రిలోకి రానీయని పరిస్థితిని ఎదుర్కొన్న పెద్దారెడ్డి, చివరికి న్యాయపోరాటం ద్వారా తన సొంతింట్లోకి అడుగుపెట్టారు. శనివారం ఆయన రాక సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ (SP Jagadeesh) పర్యవేక్షణలో సుమారు 600 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రత్యర్థి వర్గాలను ఇళ్లకే పరిమితం చేశారు. ఇలా భద్రత మధ్య తాడిపత్రిలోకి ప్రవేశించిన పెద్దారెడ్డి అనుకున్న పంతం నెగ్గించుకున్నప్పటికీ, వెంటనే పోలీసులు ఇచ్చిన నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
సుప్రీం తీర్పు ఆధారంగా పెద్దారెడ్డి పట్టణంలో ఉండేందుకు వచ్చినా, అధికార పార్టీ వర్గాలు మరోసారి తనకు ఇబ్బందులు కలిగించాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఈ పరిణామాల వెనుక ఉన్నారని స్థానికంగా చర్చ సాగుతోంది. గతంలోనే ఆయన పలుమార్లు “పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం అసాధ్యం” అని పబ్లిక్‌గా హెచ్చరించారు. ఎన్నికల తర్వాత జేసీ కుటుంబ ప్రభావం అక్కడ మరింత పెరిగిందని అంటారు.
పెద్దారెడ్డి శనివారం రాత్రి తన ఇంట్లోకి చేరుకున్నప్పటికీ, ఆదివారం ఉదయం నోటీసులు అందడంతో మళ్లీ తిమ్మంపల్లి (Thimmampalli) వెళ్లిపోవాల్సి వచ్చింది. పోలీసులు మాత్రం దీనికి కారణం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత కోసం ఇలా చేయవలసి వచ్చిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో బందోబస్తు విధులు ఉండటం వల్ల మాజీ ఎమ్మెల్యే కూడా సహకరించాలని కోరినట్లు సమాచారం. పెద్దారెడ్డి కూడా ఈసారి తాత్కాలికంగా వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారట.
అయితే, రాజకీయ వర్గాల్లో వేరే చర్చ నడుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగా తనను పూర్తిగా అడ్డుకోలేకపోయిన జేసీ వర్గం, మరో మార్గంలో ఆయనను పట్టణం నుంచి బయటకు పంపించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఒత్తిడే ఈ పరిణామానికి కారణమని పెద్దారెడ్డి అనుచరులు చెబుతున్నారు.
ఇకపై పరిస్థితి ఎలా మారుతుందన్నదే ప్రశ్న. ఈనెల 11 నుంచి తాడిపత్రిలో జేసీ బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తానని పెద్దారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కానీ 10 వరకు పట్టణంలో ఉండకూడదన్న పోలీసు ఆంక్షల కారణంగా ఆయన పథకం అమలు అవుతుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి పెద్దారెడ్డి ఒక్కరోజు పంతం నెగ్గించుకున్నా, తాడిపత్రిలో వాతావరణం మళ్లీ వేడెక్కింది అనడంలో సందేహం లేదు.