Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి కు భారీ షాక్.. ఆవిర్భావ సభలో ఐదు నోటీసులు..
వైఎస్ఆర్ (YSR) కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న సమయంలో వైసీపీకి చెందిన పలువురు నేతలు వివిధ అంశాల్లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో, వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది నాయకులపై విచారణ జరుపుతుండగా, కొందరిని అరెస్టు చేయడం, మరికొందరు ముందస్తు బెయిల్ తీసుకుని తాత్కాలికంగా బయటపడడం జరుగుతోంది. ఈ కోవలో తాజాగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే Chandragiri Ex MLA) , ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇంచార్జ్ (Ongole parliament YCP incharge) చెవిరెడ్డి భాస్కర రెడ్డి (Chevireddy Bhaskar Reddy) పేరు తెరపైకి వచ్చింది.
ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా చెవిరెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సమాచారం అందుకున్న ఎర్రగొండపాలెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో అక్కడ టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఆ సంఘటనలో చెవిరెడ్డికి సంబంధం ఉందంటూ పోలీసులు ఆరోపించారు. దీనితో ఆయనపై ఐదు కేసులు నమోదు చేశారు. తాజా పరిణామాల్లో భాగంగా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు.
పార్టీ ఆవిర్భావ వేడుకల అనంతరం చెవిరెడ్డికి నోటీసులు అందజేశారు. ఆయన కూడా సంబంధిత పత్రాలపై సంతకం చేసి స్వీకరించారు. అయితే విచారణ కోసం వెంటనే హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై చెవిరెడ్డి కూడా అంగీకారం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాను ఎలాంటి కేసులకైనా సిద్ధమేనని, భయపడేది లేదని పేర్కొన్నారు. జగన్ కోసం పోరాడిన కారణంగా గతంలో తనపై 88 కేసులు పెట్టారని, కానీ అలాంటి కేసులతో తనను అడ్డుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేయబోనని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణలు వేస్తున్నారని ఆరోపించారు. అయితే తనకు ప్రజల మద్దతు ఉందని, ఇలాంటి చర్యలు తనను వెనక్కి తిప్పలేవని స్పష్టంగా తెలియజేశారు. తాను ఎప్పుడు విచారణకైనా హాజరవుతానని, కానీ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగానే చూస్తానని చెప్పారు. ఏమైనా, రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్న ఈ సమయంలో చెవిరెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.













