Group 1: గ్రూప్ 1 స్కాం.. పీఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ ఉచ్చు..?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 (Group 1) పరీక్షల్లో జరిగిన అక్రమాల ఆరోపణలు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వ్యవస్థల్లో సంచలనం సృష్టించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో ఈ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) పేరు వెలుగులోకి వచ్చింది.
2018లో టీడీపీ (TDP) ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే, మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో (Evaluation) తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మాన్యువల్ మూల్యాంకనం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మార్కుల కేటాయించారని, ఎంపిక ప్రక్రియలో పక్షపాతం చూపించారని ఆరోపణలు వచ్చాయి. మూల్యాంకనం కోసం హాయ్ లాండ్‌లో అధికారులు బస చేయడం, ఆహార ఖర్చుల కింద రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదికలు తెలిపాయి. అంతేకాక మూల్యాంకనం మార్చి 2022లోనే జరిగినట్లు హైకోర్టుకు తప్పుడు సమాచారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, వైసీపీకి అనుకూలమైన అభ్యర్థులు ఎంపికయ్యారని టీడీపీ ఆరోపించింది.
పీఎస్ఆర్ ఆంజనేయులు వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో గ్రూప్-1 మూల్యాంకన ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాన్యువల్ మూల్యాంకనానికి ఆదేశించడం, నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనం నిర్వహించడం వంటి చర్యల్లో ఆయన పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, వైసీపీ నాయకత్వం నుంచి సూచనల మేరకు ఆయన ఈ అక్రమాలకు పాల్పడినట్లు టీడీపీ (TDP) ఆరోపించింది. 2024లో ఎన్డీఏ కూటమి (NDA) అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ అక్రమాలపై దర్యాప్తు చేపట్దింది. పీఎస్ఆర్ ఆంజనేయులుపై తాజాగా కేసు నమోదు చేసింది.
ఆంజనేయులు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) డైరెక్టర్‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి. అయితే, వైసీపీ ప్రభుత్వంలో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు, రాజకీయ ఒత్తిడుల మేరకు చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో ఆయన కీలక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.