బీటెక్ రవి దీక్ష భగ్నం
ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని కోరుతూ కడపలో ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రిమ్స్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో చేర్చి ద్రవాహారం(ప్లూయిడ్స్) ఎక్కించారు. ఈ నెల 20న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, బీటెక్ రవి ఇద్దరూ కడపలోని జడ్పీ ప్రాంగణంలో దీక్షకు దిగారు. వైద్య పరీక్షలు నిర్వహించిన రిమ్స్ వైద్యులు, ఇద్దరి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు హెచ్చరించారు. ప్రధానంగా బీటెక్ రవి పరిస్థితి బాగోలేదని వివరించారు. పరిస్థితిని అంచనా వేసి తదనుగుణ చర్యలు చేపటేట్టందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి గంటా శ్రీనివాసరావును కడపకు పంపించారు. ఆయన ఉదయం నుంచి జిల్లా ఉన్నతాధికారులతో పలుదఫాలుగా సమావేశమయ్యారు. చివరగా పోలీసులు 6 గంటల సమయానికి రవి దీక్షను భగ్నం చేశారు. సీఎం రమేష్‌ను తరలించేందుకు ప్రయత్నించగా, ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ 40 వేల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఉక్కుదీక్ష చేపట్టినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ధైైర్యంగా ఉన్నా పోలీసులు తన దీక్షను అనవసరంగా భగ్నం చేయడం సరికాదన్నారు.













