టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్ష భగ్నం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి నగరంలోని కృషి ఐకాన్ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. పల్లాను ఆసుపత్రికి తరలిస్తుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపా కార్యకర్తలు నినాదాలు చేశారు. గత ఆరురోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. పల్లా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు విశాఖ రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ముందే పోలీసులు దీక్ష భగ్నం చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్ష చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు పల్లా దీక్షకు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు సైతం విశాఖ చేరుకుని పల్లా దీక్షకు మద్దతు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులు అర్థరాత్రి దీక్ష భగ్నం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉప సంహరించుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని సృష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని పల్లా డిమాండ్ చేశారు.













