గిన్నిస్ రికార్డు కైవసం చేసుకున్న పోలవరం
పోలవరం ప్రాజెక్టులో సరికొత్త చరిత్ర. ఇన్నాళ్లు దుబాయ్ పేరిట ఉన్న 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల రికార్డు బద్దలైంది. ఆదివారం అర్థరాత్రి 12 గంటలకల్లా 22 వేలకుపైగా క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తిచేసి నవయుగ ఇంజనీరింగ్ సంస్థ గిన్నిస్ రికార్డు సాధించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం ప్రకటించారు. నవయుగ ఎండీ చింతా శ్రీధర్‌ను అభినందించారు. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ప్రాజెక్టులో కాంక్రీటు మహా యజ్ఞానికి అదివారం ఉదయం తెర లేచింది. నవయుగ సంస్థ ఉదయం ఎనిమిది గంటలకు శుభ ముహూర్తాన ఈ పనులకు శ్రీకారం చుట్టింది. ఎండీ శ్రీధర్, గిన్నిస్ బుక్ ప్రతినిధి రుషినాథ్ రిమోట్ ఆన్ చేసి కాంక్రీటు పనులు ప్రారంభించారు.













