తీర్థ యాత్రలా జనం -పోలవరం చూడాలి మనం
రాష్ట్ర ముఖ్జ్యమంత్రి సంకల్పబలానికి పోలవరం ప్రాజెక్టు నిదర్శనమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన 7 వేల మంది ప్రజలు గురువారం 150 బస్సులు, 50 కార్లతో పోలవరం ప్రాజెక్టు యాత్ర సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా స్పిల్ వే పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వేగంగా పూర్తవుతున్న ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు గుర్తింపు తెచ్చుకుందన్నారు. కేవలం 24 గంటల్లో 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసిఅ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో అరుదైన స్థానం సంపాదించుకుందన్నారు. 50 లక్షల క్యూసెక్యుల వరద నీటిని తట్టుకునే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరుగుందని, నిర్మాణ పనులలో అంతర్జాతీయ సంస్థలైన బావర్, బేకం, కెల్లర్లతో పాటు యల్ అండ్ టి, త్రివేణి, నవయుగ కంపెనీలు 2 వేల కోట్ల రూపాయల విలువైన అత్యంత ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 68 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది డిసెంబర్‌లోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, పోలవరం ఫలాలను ప్రజలకు త్వరితగతిన అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పంటపోలాలకు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం కరువు పరిస్థితులు లేకుండా సస్యశ్యామలం అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుతో 17 లక్షల ఎకరాలకు ప్రత్యేకంగా సాగునీరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 30 లక్షల ఎకరలలో పంట స్థిరీకరన జరగడంతో పాటు 540 గ్రామాలకు త్రాగునీరు, విశాఖపట్నంలోని పరిశ్రమలకు 23 టిఎంసీల నీరు అందించవచ్చన్నారు. ఈ ప్రాజెక్టుతో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించవచ్చన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియకు దేశంలోనే పోలవరం ప్రాజెక్టు నాంది పలికిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి తెలుస్తుందని, అందుకే ప్రజలను పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టామని, ప్రజలందరూ పోలవరం ప్రాజెక్టును సందర్శించడం గొప్ప అవకాశంగా భావిస్తూ, స్వచ్ఛంధంగా వస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే అంకుఠిత దీక్షతో కృషి చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రతిపక్షాలు రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతాయన్నారు.
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అంబులెన్స్ ఏర్పాటు : పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చే సందర్శకులలో కొంత మంది అనారోగ్యానికి గురికావడం, ఇటీవల ఒక వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందడం వంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోఅంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని, నిపుణులైన డాక్టర్‌ను అంబులెన్స్‌లో నియమించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి కోరారు. అంతేకాక సందర్శకులలో ఎక్కువ శాతం మహిళలు ఉండటంతో వారి సౌకర్యార్థం బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు అధికారులను మంత్రి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చే ప్రాంతంలో తరుచు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.













