ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. 12న ఉదయం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు కనీసం లక్ష మందిని తరలించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా, వసతి, ఆహార వసతులపై అధికారులు దృష్టి సారించారు. ప్రధాని చేతుల మీదుగా పలు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. ఆయా కార్యక్రమాలన్నీ సభా వేదికవద్ద నుంచే చేయనున్నారు.
రూ.400 కోట్లతో చేపట్టనున్న రైల్వేస్టేషన్, నవీకరణ, ఈస్ట్‌కోస్టు జోన్ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన, రూ.260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్ వర్కుషాపు, రూ.26 వేల కోట్లతో చేపట్టిన హెచ్‌పీసీఎల్ నవీకరణ, విస్తరణ పనులు, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనానికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.152 కోట్లతో చేపట్టనున్న చేపలరేపు నవీకణ ప్రాజెక్టు, రూ.500 కోట్ల ఖర్చుతో కాన్వెంట్ కూడలి నుంచి షీలాగనర్ వరకు పోర్టు రహదారికి శంకుస్థాపన చేస్తారు. విశాఖ` వారణాసి మధ్య కొత్తగా ప్రవేశపెట్టనున్న రైలుకు ప్రధాని జెండా ఊపే అవకావం ఉందని చెబుతున్నా, ఖరారు కాలేదు, ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది.













