నవంబరు 11న విశాఖకు ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 11న విశాఖపట్నం రానున్నారు. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ సమీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులకు వివరాలు అందాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల పరంగా చేపట్టనున్న మరికొన్ని కార్యక్రమాలకు అదే రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఏయూ ఇంజీనీరింగ్ కళాశాల మైదానంలో సభ ఏర్పాటు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రధాని పర్యటనలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, ఇతర అధికారులు ప్రాథమికంగా చర్చించారు.













