తిరుపతిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోదీకి గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. మోదీకి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. వీరితోపాటు ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నారాయణస్వామి, వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, పార్టీ విప్ చెవిరెడ్డి భాస్కర్, పలువురు వైసీపీ, బీజేపీ నేతలు ఉన్నారు. అనంతరం ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో మోదీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం మోదీ నేరుగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రజాధన్యవాద సభలో పాల్గొన్నారు. సభ తర్వాత ప్రధాని మోదీ తిరుమలకు వెళ్లారు. ప్రధాని మోదీతో పాటు జగన్, నరసింహన్ శ్రీవారిని దర్శించుకోన్నారు.













