తిరుమల ఆలయంలో అరుదైన ఘటన
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం నిమిషం పాటు నిలబడిన సంఘటన తిరుమల ఆలయం వద్ద చోటు చేసుకుంది. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ శ్రీవారి ఆశీస్సులు పొందడం కోసం తిరుమల చేరుకున్నారు. అనంతరం పద్మావతి అతిథి భవనం నుంచి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక వాహన శ్రేణిలో ఆలయం వద్దకు చేరుకున్న నరేంద్ర మోదీ కారు దిగారు. వెంటనే అక్కడకు గవర్నర్ నరసింహన్ ఆయన వదకు చేరుకున్నారు. వాహన శ్రేణిలో వెనునున్న ముఖ్యమంత్రి జగన్ రావడానికి నిమిషం ఆలస్యం అయింది. వాహనం దిగిన ప్రధాని మోదీ, గవర్నర్, టీటీడీ అధికారులతో కలిసి ఆలయంలోకి వెళ్లకుండా జగన్మోహన్రెడ్డి కోసం వేచి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సీఎం గారు.. ప్రధాని మీకోసం వేచి వున్నారు.. అని చెప్పగానే సీఎం జగన్మోహన్రెడ్డి పరుగు లాంటి నడకతో ఆయన వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ, సీఎం జగన్ కలిసి టీటీడీ అధికారుల వెంట ఆలయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఒక ముఖ్యమంత్రి కోసం ప్రధాని వేచి ఉండటం కేంద్ర, రాష్ట్రాల మధ్య బంధం మెరుగుపడుతుందని, అందులోనూ సాక్షాత్తు వెంకన్న సన్నిధిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం శభపరిణామమని సగటు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.













