ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి : మోదీ
ప్రపంచానికి ప్రేమను పంచిన మహానీయుడు సత్యసాయి బాబా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ను వర్చువల్గా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రపంచానికి ఆయన సేవా మార్గాన్ని చాటిచెప్పారని గుర్తు చేశారు. పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతి అని తెలిపారు.
సత్యసాయి బాబా ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి. ప్రేమ అనే రెండు అక్షరాల్లోనే అనంతమైన శక్తి ఇమిడి ఉంది. ప్రేమించండి.. ప్రేమను పంచండంటూ ఆయన ప్రేమ సందేశమిచ్చారు. సత్యసాయి తన జీవితాన్ని పేదలకు అంకితం చేసిన తీరు ఆదర్శనీయం. సేవాభావమే జీవన విధానంగా మార్చుకున్నారు. మానవ సేవే మాధవ సేవని గుర్తించి జీవించాలి. కరుణ, ప్రేమరసంతో ఎంతోమందిని ఆయన అక్కువ చేర్చుకున్నారు. సత్యసాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది. పుట్టపర్తిలోనూ అన్ని కార్యకలాపాలు డిజిటల్ రూపంలోకి మారాలి అని మోదీ ఆకాంక్షించారు.













