Pithapuram: టీడీపీ, జనసేనకు సవాల్‌గా మారిన పిఠాపురం పంచాయితీ..!!
ఆంధ్రప్రదేశ్ పిఠాపురం (Pithapuram) నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిన విషయమే. జనసేన (Janasena) అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు టీడీపీ నేత SVSN వర్మ ఈ నియోజకవర్గంలో ఓసారి ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చాటారు. అయితే తాజా ఎన్నికల్లో వర్మ సీటును వదులుకుని పవన్ కల్యాణ్ కు త్యాగం చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది.. కానీ గెలిచిన తర్వాత జనసైనికులు వర్మను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిప్పుడు వర్మలో ఆగ్రహానికి కారణమవుతోంది. అటు జనసైనికులు, ఇటు టీడీపీ (TDP) నేతల అసంతృప్తుల మధ్య పార్టీ హైకమాండ్స్ తలలు పట్టుకుంటున్నాయి.
పవన్ కల్యాణ్ ను గెలిపించాలని, నీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీతో వర్మ పూర్తిస్థాయిలో పనిచేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. పవన్ కల్యాణ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. తనకు ఇంత భారీ మెజారిటీ వర్మ వల్లే సాధ్యమైందన్నారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడం ఖాయమనుకున్నారు. అయితే తాజాగా ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) జరగగా వర్మకు మొండిచేయి చూపింది టీడీపీ హైకమాండ్. ఇది వర్మ అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది. టీడీపీ కేడర్ కూడా వర్మకు అన్యాయం చేశారని విమర్శించింది.
వర్మకు ఇవ్వకపోగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు (Naga Babu) ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. అంతేకాక నేడోరేపో మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఇది వర్మ అభిమానుల్లో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పైగా ఇటీవల పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా నాగబాబు చేసిన ‘ఖర్మ’ కామెంట్స్ స్థానికంగా పెద్ద కలకలమే రేపాయి. వర్మతో పాటు ఆయన అభిమానులు నాగబాబు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా వర్మ సిద్ధమవుతున్నారనే టాక్ నడుస్తోంది. వర్మ కోసం తెరవెనుక వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబుకు మంత్రిపదవి ఇస్తే పిఠాపురంలో టీడీపీ మరింత నష్టపోతుందనే అంచనాలున్నాయి. అందుకే వర్మను శాంతింపజేయాలన్నా, కేడర్ ను సంతృప్తి పరచాలన్నా నాగబాబుకు మంత్రిపదవి ఇవ్వకూడదని చాలా మంది సూచిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఇందుకు అంగీకరిస్తారా అనేది పెద్ద డౌట్. వర్మ పార్టీ వీడితే పిఠాపురంపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందే. వర్మ మద్దతు లేకుంటే తమ పరిస్థితి నల్లేరుపై నడక మాత్రం కాబోదని జనసేనకు తెలుసు. అందుకే ఈ చిక్కుముడిని ఎలా విప్పాలనేదానిపై టీడీపీ, జనసేన పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.













