కూటమిలో పిఠాపురం చిచ్చు..! చుక్కలు చూపిస్తున్న వర్మ!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఏకతాటి పైకి వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడేందుకే జట్టు కట్టినట్టు ఆ పార్టీలు చెప్తున్నాయి. అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలంతా కూటమని ఆదరించాలని కోరుతున్నాయి. అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారం కూటమికి పెను సవాల్ గా మారింది. ఇప్పటివరకూ టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై పూర్తి క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన చోట అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆ విషయంలో పిఠాపురం ముందుంది.
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఇన్నాళ్లూ ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో తెలియక ఆతృతగా ఎదురు చూశారు. భీమవరం, తిరుపతి స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఈసారి ప్రయోగాల జోలికి పోకుండా సేఫ్ ప్లేస్ కోసం వెతికారు పవన్ కల్యాణ్. కాపులు ఎక్కవగా ఉన్న పిఠాపురం అయితే ఈజీగా గెలవచ్చని భావించారు. అందుకే పిఠాపురం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు చెప్పారు.
పిఠాపురం నుంచి వైసీపీ తరపున ఈసారి వంగా గీత బరిలోకి దిగుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం నుంచి ఆమె గెలిచారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని సమాచారం ఉండడంతో వంగా గీతను వ్యూహాత్మకంగా ఆమెను ఎంచుకున్నారు జగన్. పైగా పిఠాపురంలో మంచి పట్టుందని భావిస్తున్న ముద్రగడ తాజాగా వైసీపీలో చేరారు. దీంతో ఎలాగైనా పవన్ కల్యాణ్ ను ఓడిస్తామని వైసీపీ ధీమాగా ఉంది.
మరోవైపు కూటమి తరపున జనసేన నుంచి బరిలోకి దిగబోతున్న పవన్ కల్యాణ్ కు మాత్రం ఆదిలోనే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మంగళగిరి ఆఫీసులో పవన్ కల్యాణ్ అనౌన్స్ చేసాడో లేదో.. వెంటనే పిఠాపురం సీటు ఆశించిన టీడీపీ నేత వర్మ భగ్గుమన్నారు. ఆయన అనుచరులు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. వర్మకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని చంద్రబాబుకు, లోకేశ్ కు హెచ్చరికలు జారీ చేశారు. 2014లో ఇలాగే టిడీపీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు వర్మ. ఇప్పుడు కూడా తాను అలాగే బరిలోకి దిగుతానని హెచ్చరిస్తున్నారు. ఇదిప్పుడు టీడీపీ, జనసేనకు పెద్ద సవాల్ గా మారింది.
పిఠాపురం సీటును జనసేనకు కేటాయించినప్పుడు కనీసం మాటమాత్రమైనా ఆ విషయాన్ని వర్మకు చెప్పి ఉంటే బాగుండేది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తాడు కాబట్టి సహకరించాలని చంద్రబాబు చెప్పి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో! మరోవైపు పవన్ కల్యాణ్ అయినా వర్మకు ఫోన్ చేయడమో.. లేకుంటే నేరుగా కలిసి సహకరించాలని కోరడమో చేసింటే సమస్యకు పరిష్కారం దొరికేది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సమస్యను మరింత జటిలం చేసుకున్నారు. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని స్థానికులు చెప్పుకుంటున్నారు. మరి చూడాలి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో..!













