‘పిల్లి సుభాష్ చంద్రబోస్’తో తంటా..
రామచంద్రాపురం వైసీపీలో ఆధిపత్యపోరు తాడేపల్లి ప్యాలెస్ కు తలనొప్పిగా మారింది. ఓవైపు చిరకాల సన్నిహితుడు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మరోవైపు విధేయుడు వేణు మధ్య విభేదాలు సద్దుమణగడం లేదు. సాక్షాత్తూ సీఎం జగన్ జోక్యం చేసుకున్నా పరిస్థితి సద్దుమణగడం లేదు. తనకు వ్యతిరేకంగా మంత్రి వేణు వర్గం పనిచేస్తున్నా.. అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఎంపీ బోసు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వచ్చేనెల్లో ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేసేందుకు ఎంపీ బోస్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
మంత్రి వేణుకు టికెట్ ఇస్తే వైసీపీకి రాజీనామా చేస్తానని ఎంపీ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను లేదంటే తన కొడుకు రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.. వేణుతో విబేధాలపై జగన్ తనను పిలిచి మాట్లాడారని, మంత్రి వేణుతో కూర్చుని చర్చిస్తానని జగన్ తనతో చెప్పారన్నారు. అయితే వేణుతో భేటీకి తాను రానని జగన్ కు చెప్పానని పిల్లి సుభాష్ చెప్పారు. ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు చెప్పానని అన్నారు. వేణు చెప్పు కింద బతికే వాళ్ళు నియోజకవర్గం లో ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్…. మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం మంత్రి వేణుకే టిక్కెట్ ఖరారు చేస్తే.. ఇండిపెండెంట్‌గానైనా లేదా టీడీపీ తరఫున బరిలోదిగి వేణును ఓడించాలని నిర్ణయించారు. స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ మంత్రి వర్సెస్ బోసుగా మారింది. ఈవ్యవహారం రామచంద్రాపురం వైసీపీ క్యాడర్ లో గందరగోళంగా మారింది.
తాజాగా మంత్రి వేణు వర్గం వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రిగా వేణు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను సన్మానించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై తనకు సమాచారం లేదని పిల్లి సుభాష్ చెబుతున్నారు. మరోవైపు గతవారం బోస్ వర్గం నిర్వహించిన సమావేశంలో రాబోయే ఎన్నికల్లో బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తారని మంత్రికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దీంతో మూడేళ్ల బలప్రదర్శన కార్యక్రమం ఇప్పుడు రెండు వర్గాల ఆధిపత్యపోరును మరోసారి బయటపెట్టింది. ఎవరికి వారే నేతలు ఇష్టనుసారం వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం వైసీపీలో కలకలం రేపుతోంది.













