Perni Nani: పేర్ని నానికి కూటమి నేతలే సహకరిస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో పేర్ని నాని (Perni Nani) గోడౌన్ లో బియ్యం మాయం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన గోడౌన్లలో తనిఖీలు చేసేకొద్దీ డొల్లతనం బయటపడుతోంది. ఇప్పటికే మాయమైన బియ్యానికి (PDS Rice) కోటీ 72 లక్షల రూపాయలను పేర్ని నాని జరిమానాగా చెల్లించారు. అయితే ఇప్పుడు మరికొన్ని టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) స్వయంగా వెల్లడించారు. దీనికి మరో రూ.50 లక్షల వరకూ చెల్లించాల్సి రావచ్చని అంచనా. ఇప్పుడు ఈ డబ్బు కూడా పేర్ని నాని చెల్లించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే పేర్ని నానిని కాపాడేందుకు కొందరు కూటమి నేతలే తెరవెనుక ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు అప్పడు విపక్షంలో ఉన్న టీడీపీ (TDP), జనసేనపై (Janasena) మంత్రి హోదాలో పేర్ని నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయేవారు. కొడాలి నాని, పేర్ని నానిలను తమ వాయిస్ గా ఉపయోగించుకుంది వైసీపీ. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పేర్ని నాని గట్టిగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టార్గెట్ గా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర సంచలనం కలిగించాయి. యాదృచ్ఛకమో ఏమో కానీ ఇప్పుడు పేర్ని నాని జనసేన మంత్రులకే అడ్డంగా దొరికిపోయారు. దీంతో వాళ్లు పేర్ని నానికి చుక్కలు చూపెడుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు నవంబర్ లో పీడీఎస్ బియ్యం గోడౌన్లలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్న గోడౌన్ లో 187 టన్నుల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. టెక్నికల్ కారణాల వల్ల బియ్యం మాయమయ్యాయని.. వాటి విలువ చెప్తే కట్టేస్తానని పేర్ని నాని లేఖ రాశారు. ఇందుకు అధికారులు కోటీ 72 లక్షలు కట్టాలని సూచించారు. ఆ మేరకు కోటి రూపాయలు ఒకసారి, 72 లక్షలు మరోసారి చెల్లించేశారు. ఇంతటితో ఆ వ్యవహారానికి ముగింపు పలికినట్లేనని అందరూ భావించారు.
అయితే పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు తనిఖీలు నిర్వహించగా.. మరిన్ని టన్నుల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. వాటి విలువ మరో 50 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాక.. పేర్ని నానికి సెంబంధించిన మరో గోడౌన్ లో కూడా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అందులో బియ్యం ఏ స్థాయిలో మాయమయ్యాయో.. అవి ఎక్కడికెళ్లాయో తెలీదు. వీటన్నిటినీ లెక్కించి నిజాలు బయటపెట్టేందుకు మంత్రులు, అధికారులు సిద్ధమవుతున్నారు.
అయితే పేర్ని నానితో సన్నిహిత సంబంధాలు కలిగిన కొందరు కూటమి నేతలు ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. జరిమానా చెల్లించడం ద్వారా తప్పించుకోవచ్చని కొందరు అధికారులు, కూటమి నేతలు ఇచ్చిన సలహా మేరకే ఆయన డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. అంతేకాక అప్పటికప్పుడు అంత డబ్బు సర్దింది కూడా కూటమికి సన్నిహిత సంబంధాలు కలిగిన నేతలేనని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు నానా ఇబ్బందులు పెట్టిన పేర్ని నానిని ఇప్పడు కూటమి నేతలు వెనకేసుకు రావడాన్ని టీడీపీ, జనసేన కేడర్ అస్సలు సహించట్లేదు.













