Perni Nani: లిక్కర్ స్కాంపై పేర్ని రియాక్షన్
మాజీ మంత్రి విడదల రజనీపై, లిక్కర్ స్కాంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నానీ స్పందించారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు అంటూ స్పష్టం చేసిన నానీ.. పార్లమెంటును అడ్డు పెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలి హితవు పలికారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కాం జరిగిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారని.. ప్రతిచోటా బెదిరించి కమీషన్లు, లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వీటిపై పార్లమెంటులో మాట్లాడాలని సూచించారు. వైసీపి ప్రభుత్వంలో వేలకోట్లు దేశం దాటి వెళ్లినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేశారని అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా? మరెందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివాడని టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగ పడుతుందని సూచించారు.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిదన్నారు. రాయలసీమ లిఫ్టు ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిదని సూచించారు. దక్షినాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి మాట్లాడాలన్నారు. కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడటం లేదని.. కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే లావు శ్రీకృష్ణ దేవరాయలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చెరబట్టారని విమర్శించారు. కమీషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారు అని ఆరోపించారు.













