Perni Nani : పేర్ని నానికి నొప్పి తెలిసొచ్చిందా..!?
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని (Perni Nani) కుటుంబం కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంది. రేషన్ బియ్యం (Ration Rice) మాయం వ్యవహారంలో వాళ్లను అరెస్టు చేస్తారనే భయంలో నాని కుటుంబమంతా పరారీలో ఉంది. పేర్ని నాని పరార్.. అందుబాటులోని నేత.. అంటూ రోజూ మీడియాలో., సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ మీడియా ముందుకొచ్చారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను.., తన కుటుంబం ఏ తప్పూ చేయలేదని.. తమపై అనవసరంగా కక్ష సాధిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. తన ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల (Minister Nadendla Manohar) సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
వయసు మీద పడుతోందని.. అందుకే గోడౌన్లు కట్టుకుంటే అద్దెలు వస్తాయని భావించి వాటిని కట్టుకున్నామని పేర్ని నాని చెప్పుకొచ్చారు. బియ్యం మాయమైన గోడౌన్ ను తన అత్తమామలు నిర్మించి తమకు ఇచ్చారన్నారు. తాను కానీ, తన కుటుంబసభ్యులు కానీ ఆ గౌడౌన్ వ్యవహారాలు చూడట్లేదని.. మేనేజర్ చూసుకుంటున్నారని పేర్ని నాని వివరించారు. అయితే అక్కడున్న స్టాక్ లో తేడాలున్నట్టు చెప్పగానే జాయింట్ కలెక్టర్ కు రెప్రజెంటేషన్ ఇచ్చామని.. తగ్గిన స్టాక్ కు జరిమానా కట్టాలని వాళ్లు చెప్పారని వివరించారు. ఆ మేరకు డబ్బులు చెల్లించామన్నారు. అయినా తమపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ భార్య (Perni Jayasudha) బెయిల్ పిటిషన్ కోసం కోర్టును ఆశ్రయిస్తే అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని పేర్ని నాని చెప్పారు. ఏదో ఒక కారణంతో వాయిదాలు కోరుస్తూ ఆలస్యం చేస్తున్నారన్నరు. రాజకీయ కక్షతో తనను, తన భార్యను అరెస్టు చేయాలనుకుంటున్నారన్నారు. నేను ఎక్కడికో పారిపోయినట్లు వార్తలు రాస్తున్నారన్నారు. తానెక్కడికీ పారిపోలేదన్నారు. నా భార్యకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆవిడను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నానన్నారు. నేను తప్పు చేసే వ్యక్తినా అని ప్రశ్నించారు. తన భార్యను అరెస్టు చేయాలని ఓ మంత్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కలిస్తే ఆయన ఒప్పుకోలేదన్నారు. ఆడవాళ్లను అరెస్టు చేస్తారా.. కావాలంటే నాని, వాళ్లబ్బాయిని అరెస్టు చేసుకోవాలని చెప్పారని నాని వివరించారు. చంద్రబాబు తిట్టిన తర్వాత కూడా తమపై వేధింపులు ఆగలేదన్నారు. నన్ను, నా భార్యను వేధిస్తున్నారన్నారు. నన్ను చేసుకున్న పాపానికి తన భార్య నిందలు మోస్తోందన్నారు. దేవిడి దయ వల్ల నా భార్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాలేదన్నారు.
ఇంట్లో ఆడవాళ్ల వరకూ వచ్చేశారని పేర్ని నాని చేసిన కామెంట్స్ కు ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి. గోడౌన్ ఆమె పేరిట ఉంది కాబట్టే ఆమెకు నోటీసులు ఇచ్చారని.. ఇందులో అధికారుల తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పూ లేకపోయినా ఆడవాళ్లను రోడ్డుకీడ్చారని.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. తప్ప చేయలేదంటున్న పేర్ని నాని.. ఎందుకు జరిమానా కట్టారని అడుగుతున్నారు. మరి వీటికి పేర్ని నాని దగ్గర సమాధానాలున్నాయా.. అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా తన వరకూ వస్తేకానీ పేర్ని నానికి అర్థం కాలేదని చెప్పుకుంటున్నారు.













