అందుకే తెలంగాణలో కొత్త పార్టీలు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఓ ఐపీఎస్ అధికారి రాజీనామా చేసి మరీ పార్టీ పెట్టారని, మరి కొన్ని పార్టీలు కూడా వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుందని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల గుండెల్లో ఎక్కడా శూన్యత లేదన్నారు. నదీ జలాల వినియోగంలో కేసీఆర్ మాట తప్పారని అన్నారు. డిరడి, పాలమూరు ప్రాజెక్టు నుంచి తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించుకోబోమని ఎప్పుడో చెప్పామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరమో, విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అంతే దూరమని గమనించాలన్నారు.













