Perni Nani: రేషన్ బియ్యం కేసులో కుట్రే – పేర్ని నాని తీవ్ర ఆరోపణలు..

మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం (NDA Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలపై జరుగుతున్న చర్యలపై ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను , తన కుటుంబం ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేస్తూ, ఇది ఎంతటి బాధాకరమైందో వివరించారు. మచిలీపట్నం (Machilipatnam) లో తనకిచ్చిన గిడ్డంగిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలతో తనపైనా, తన భార్యపైనా కేసులు పెట్టిన తీరు ఆయనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.
ఆ కేసుల నేపథ్యంలో తాను 15 రోజులు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రతి రోజు ఒక ఇంట్లో తలదాచుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పిన ఆయన, అది మానసికంగా ఓ మరణశిక్షే అని వ్యాఖ్యానించారు. తన భార్యను అరెస్ట్ చేసేందుకు అధికార యంత్రాంగం ఎంతగా ప్రయత్నించిందో వివరించారు. ఆమెను జానవరి 1న పోలీస్ స్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి ప్రశ్నించడం, బెదిరించడం జరిగిందని పేర్కొన్నారు. ఇది ఏ ఒక్కరి కుటుంబానికైనా జరగకూడదని, శత్రువుకైనా ఇలాంటి పరిస్థితి రావొద్దని ప్రార్థించానని చెప్పారు.
తాము ముందస్తుగా బెయిల్ పొందినా, అధికార పక్షం వదలకుండా వేధింపులకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఒకవేళ తప్పు జరిగిందని భావించి, దానికి విలువ చెల్లించినా ఎందుకు కేసులు పెడుతున్నారు అనే ప్రశ్న ఆయన లేవనెత్తారు. దాదాపు రూ.1.70 కోట్ల విలువైన బియ్యం విషయంలో ప్రభుత్వం కు చెల్లించినా, పౌర సరఫరాల శాఖ కేసు పెట్టడం తమను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నదే అని నాని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న తరుణంలో, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ వ్యాఖ్యలు మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమపై జరుగుతున్న వేధింపులకు సమాధానం చెప్పాల్సిన రోజులు వస్తాయని పేర్ని నాని స్పష్టంగా హెచ్చరించారు. ‘‘వాళ్లవంతు రోజులు నడుస్తున్నాయి.. కానీ తిరిగి మా వంతు రోజు వచ్చి వాతకు పది వాతలు పెడతాం’’ అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఏపీ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.