గతేడాది డిసెంబర్ 25నే కోటం రెడ్డి బ్లూ కార్లో వెళ్లి చంద్రబాబును కలిశారు: పేర్ని నాని
వైసీపీని వదిలి వెళుతున్న కోటం రెడ్డిపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. కోటంరెడ్డి చేసింది కచ్చితంగా నమ్మక ద్రోహమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ పిచ్చి మారాజు, అందర్నీ నమ్మేస్తారని, అందుకే కోటం రెడ్డి నమ్మకద్రోహం చేయగలిగాడని విమర్శించారు. గతేడాది డిసెంబర్ 25న చంద్రబాబు ఇంటికి బ్లూ కలర్ బెంజ్ కార్ వేసుకొని కోటంరెడ్డి వెళ్లారని, అంతకుముందు నుంచే లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. అలాగే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభిమానంతో కాదని, పక్కా ప్లాన్‌తో వచ్చిన మాటలని విమర్శించారు. కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డింగ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు.
‘ఎన్నికలు వచ్చే సమయం అంటేనే పక్షులు ఎగిరేకాలం. నేను రాజశేఖర్ రెడ్డిని అభిమానించాను. అందుకే జగన్ వెనుక నిలబడ్డాను. అభిమానిస్తే అవసరాల గురించి మాట్లాడం. పదవి ఇచ్చారా లేదా అని చూడం. కోటంరెడ్డి రాజకీయ అవసరాల కోసం ఆరోపణలు చేస్తున్నారు. పదవులు ఇవ్వలేదని అలిగితే అది రాజకీయ అవసరాలు. కోటంరెడ్డిని నారాయణతో టచ్ లో ఉండాలని చంద్రబాబు చెప్పారట. చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారు. ఆడియో రికార్డింగ్ చూపించి ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని పేర్కొన్నారు.













