తాత్కాలిక రాజధాని పేరుతో భారీగా డబ్బులు తిన్న చంద్రబాబు: పేర్ని నాని
ఏపీ తాత్కాలిక రాజధాని పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ముడుపులు కొట్టేశారని, ఈ గుట్టును ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ బట్టబయలు చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయంపై హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో వార్త వచ్చిందని వెల్లడించారు. ప్రజల సంపదను చంద్రబాబు ఎలా అడ్డదారిలో కొట్టేశాడో ఈ కథనం బయట పెట్టిందని పేర్ని నాని చెప్పారు. తాత్కాలిక రాజధాని పేరుతో కొన్ని కంపెనీలకు భారీగా కాంట్రాక్టులు కట్టబెట్టారని, దాని కోసం సదరు కంపెనీల నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేశారు.
ఈ ముడుపుల వ్యవహారం మొత్తాన్ని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ నడిపాడని తెలిపారు. ఈ సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టులతో చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు అందాయని, మనోజ్ పార్థాని ముడుపులు ఇచ్చినట్లుగా స్పష్టంగా తేలిందరి వెల్లడించారు. హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన ఈ వార్త నిజమా? కాదా? అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద పత్రిక అయిన హిందూస్థాన్ టైమ్స్ కావాలని ఇలా తప్పుడు వార్తలు రాసిందా? చంద్రబాబు అమాయకుడా? అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజం కాదా? ముడుపులు తిన్నారా? లేదా? ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు సెప్టెంబర్ 22న నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? హిందుస్థాన్ టైమ్స్పై పరువు నష్టం దావా వేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలని, తను తప్పు చేయకపోతే నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఒక్క అమరావతిలోనే ఇంత డబ్బు కాజేస్తే.. మిగతా పనుల్లో ఎంత తినేసి ఉంటారో? అన్నారు.













