చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే విమర్శలు.. పవన్‌పై పేర్ని నాని హాట్ కామెంట్స్
ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ప్రజలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా వైసీపీపై పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ రాజకీయ పార్టీనా ఉగ్రవాద సంస్థ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానంటూ సజ్జలకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అయితే తాజాగా పవన్ ప్రసంగంపై వైసీపీ నేత పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ఇప్పటం ప్రజలతో సమావేశం సందర్భంగా పవన్ మాట్లాడిన ప్రసంగంలో వైసీపీపై విద్వేషమే ఎక్కువ కనిపిస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తామని పదేపదే పునరుద్ఘాటించారని, టీడీపీ నేత చంద్రబాబు కళ్లలో ఆనందం చూసేందుకే పవన్ ఈ విమర్శలు చేశారని పేర్ని నాని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను నమ్మాలని, గెలిపించాలని పవన్ అంటున్నారని, కానీ పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే ఉంటుందంటూ సెటైర్లు పేల్చారు. ఈ సమావేశం అంతా కూడా రాష్ట్రంలో సమస్యలపై, ఇప్పటం ప్రజల ఇబ్బందులపై కాకుండా వైసీపీ, వైఎస్ఆర్ కుటుంబం టార్గెట్‌గా జరిగిందని ఆరోపించారు. ప్రధాని మోదీతో జరిగిన భేటీపై పవన్ పూటకోమాట మాట్లాడుతున్నారని, మోదీ, పవన్ ఏం మాట్లాడుకుంటే మాకెందుకని ప్రశ్నించారు.













