పవన్ పనైపోయింది.. జనసైనికుల గురించి బాధ: పేర్ని నాని
చివరి ఎన్నికల్లో కనీసం 30-40 సీట్లు వచ్చి ఉంటే సీఎం పదవి డిమాండ్ చేసేవాడినని పవన్ కల్యాణ్ అనడంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. పవన్ను సీఎం చేయాలని జనసైనికులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా మానుకుని రోడ్లపై తిరుగుతున్నారని, పవన్ మాత్రం తాను సీఎం అభ్యర్థిని కాదంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ను నమ్ముకున్న జనసైనికుల పరిస్థితి ఇప్పుడు ఏంటని ప్రశ్నించారు. తన బాధ అంతా అలాంటి జనసైనికుల గురించే అని పేర్ని నాని అన్నారు. జనసైనికులు ఇకనైనా పవన్ కోసం త్యాగాలు మాని, తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడానికి కృషి చేయాలని సలహా ఇచ్చారు.
చంద్రబాబుకు ఎప్పుడు చెబితే అప్పుడు, ఆయనకు అవసరం అయినప్పుడు మాత్రమే పవన్ బయటికి వస్తాడని, చంద్రబాబు అవసరాలు తీర్చేందుకు ఏర్పాటైన టెంట్ హౌస్ పార్టీ జనసేన అని నాని విమర్శించారు. ఇటీవల వారాహి అంటూ సందడి చేసిన పవన్.. ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తే బయటికి ఆ బండిని బయటకు తీస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. 2014లో పరిస్థితులు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయని తెలిసే పవన్ పోటీ చేయలేదని, కానీ 2019లో చంద్రబాబుకు వ్యతిరేకత ఉందని తెలియడంతో వ్యతిరేక ఓటు జగన్కు వెళ్లకుండా చేసేందుకు ఆ ఎన్నికల బరిలో దిగాడని చెప్పారు. ఓట్ల కోసమే రాజకీయాలు చేసే పవన్ పని అయిపోయిందని తేల్చిచెప్పారు.













