డేటా చోరీ ఆరోపణలపై ఆగ్రహం.. పవన్ కల్యాణ్‌కు పేర్ని నాని సవాల్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. జగన్‌ను జైలుకు పంపుతానంటూ పవన్ సొల్లు కబుర్లు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా చోరీ చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై విచారణకు తాము సిద్ధమని పేర్ని నాని చెప్పారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌కు దమ్ముంటే, తనకు ఇష్టం వచ్చిన సంస్థతో లేదా కేంద్ర సంస్థతో విచారణ చేయించుకోవాలని సవాల్ విసిరారు. ‘మోదీ నా చేతిలో ఉన్నారు. అమిత్ షా నా చేతిలో ఉన్నారని చెప్తున్నావు కదా.. నీకు బీజేపీతో మంచి అనుబంధం ఉంది అంటున్నావు కదా.. అప్పుడు కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించు. మేం దానికి కూడా సిద్ధం’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. ‘అమిత్ షాతో మాట్లాడితే అంత గొప్పా? నీకు చేతనైంది చేసుకో’ అని సవాల్ చేశారు. ‘మీకు చేతనైతే మీ ముగ్గురూ.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జగన్ ప్రభుత్వాన్ని ఓడించండి చూద్దాం. అఖండ ప్రజలు కోరుకుంటే ఎన్డీయే అధికారంలోకి వస్తుందని పవన్ చెప్తున్నారు. ఇంతకీ అఖండ ప్రజలు అంటే ఎవరు? అఖండ సినిమానా?’ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే నువ్వు.. ఏపీకి ఏమైనా తెచ్చావా? అని నిలదీశారు. పవన్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం జరగలేదని విమర్శించారు.













