Perni Jayasudha: రేషన్ బియ్యం కేసు పై పేర్ని జయసుధ వివరణ.. కేసు మళ్లింపు కి ప్రయత్నం..
రేషన్ బియ్యం (Ration Rice) కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) సతీమణి పేర్ని జయసుధ (Perni Jayasudha) ఇటీవల బందరు తాలుకా పోలీస్ స్టేషన్కు హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణలో ఆమెను రెండున్నర గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, ఈ విచారణలో జయసుధ తనకు చాలా విషయాలు గుర్తు లేవని, తనకు తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, జయసుధ ఒక కొత్త వాదనను పోలీస్ విచారణలో ప్రస్తావించినట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రేషన్ బియ్యం నిల్వ ఉంచే గోదాముల నిర్వహణ బాధ్యతలను మేనేజర్ మానస్ తేజ చూసేవాడని, అతడే ఆమెకు తెలియకుండా బియ్యాన్ని పక్కదారి పట్టించాడని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, ఆమెపై ఉన్న ఆరోపణలను మేనేజర్పైకి నెట్టే ప్రయత్నం చేసినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణలో అందిన వివరాల ఆధారంగా జయసుధను పోలీసులు ప్రశ్నించిన సమయంలో ఆమె విచారణకు సహకరించింది కానీ వివరాలు తెలియదు అంటూ చాలా తెలివిగా కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అలాగే జయసుధ పోలీస్ స్టేషన్కు నగర మేయర్ వాహనంలో హాజరైన విషయం వివాదాస్పదమైంది.
ఒక ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబరు 31న రాత్రి ఆమె ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆమె ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో జనవరి 1న విచారణకు హాజరవ్వాలని సూచించారు. విచారణకు ఆమె వెళ్ళినప్పుడు, ఆమె వెంట మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, లాయర్లు, పార్టీ నాయకులు కూడా పోలీస్ స్టేషన్కు రావడం మరింత చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో నాయకులను పోలీస్ స్టేషన్ వద్ద నిలిపివేసే చర్యలు తీసుకుంటారు. కానీ ఈసారి పోలీసులు అలా చేయలేదని, చూసిచూడనట్లుగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. విచారణ సమయంలో జయసుధ ఆరోగ్యం బాగోలేదని చెబుతూనే, రెండున్నర గంటల పాటు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంపై కూడా ఆమె అభిమానులు, పార్టీ ఫాలోయర్లు నిరసనలు వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట వారు ఆందోళన చేపట్టడం వివాదాస్పదంగా మారింది.
ఇలాంటి వివాదాలు పేర్ని జయసుధ కేసును మరింత ప్రశ్నార్థకంగా మార్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క కూటం ప్రభుత్వం పెర్ని నాని కుటుంబంపై ఎందుకు అంత ప్రేమ కురిపిస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.













