Ap pensions: ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ సర్వే: అర్హులకు న్యాయం, అనర్హులపై చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) ప్రభుత్వం సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లను (Pensions ) అందిస్తోంది. అర్హులైన వృద్ధులకు నెలకు ₹4,000, వికలాంగులకు ₹6,000, దీర్ఘకాలిక రోగులతో మంచానపట్టిన వారికి ₹15,000, పక్షవాతం బాధితులకు ₹10,000 చొప్పున పెన్షన్లను అందజేస్తున్నారు. దీనికి ఏటా వేల కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చవుతున్నాయి.
అయితే అనర్హులు పెన్షన్ పొందడమే పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక సర్వేను చేపట్టింది. రాండమ్ చెకింగ్ రూపంలో జరిగిన ఈ సర్వేలో అనేక భోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా వికలాంగుల కోటాలో అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు. కొంతమంది తక్కువ మోతాదులో వికలాంగత్వం ఉన్నా, ఎక్కువగా ఉన్నట్లుగా రాయించుకుని పెన్షన్లు తీసుకుంటున్నారని సర్వే వివరించింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దింపి ఆరు దశలుగా వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సర్వేలో అనర్హులు ఉంటే వారికి పెన్షన్లు తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క కొంతమంది లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో నివసించకుండా ఇతర రాష్ట్రాలు లేదా దేశాల్లో ఉంటూ పెన్షన్లు పొందుతున్నారు. వీరిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటివరకు అనర్హుల కారణంగా పెన్షన్ కోసం అర్హులైన వారు చాలా మంది ఆర్థిక సహాయం పొందలేకపోతున్నారు. వీరికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ఈ సర్వే ద్వారా అనర్హులను తొలగించి, అర్హులకు అవకాశం కల్పించనుంది.
ఈసారి సర్వే అత్యంత కఠినంగా జరగనుంది. ప్రతి లబ్ధిదారుడి వివరాలను ధృవీకరించి, అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అర్హతలు నిర్ధారించడంలో ఎలాంటి లోపం ఉండకుండా ప్రభుత్వం పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటోంది. మొత్తానికి ఈ చర్యల ద్వారా అర్హులకు న్యాయం జరుగుతుందని, అనర్హుల కారణంగా ప్రజా ధనం వృథా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తోంది.













