రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు భాగమవ్వాలి.. మంత్రి పెమ్మసాని పిలుపు
అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు అంధ్రప్రదేశ్‌కు వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుని మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని, ఐటీ, ఇతర సాంకేతిక రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు మద్దతుగా ఉండాలని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు జాగర్లమూడి వెంకట్ ట్రైనింగ్ సెంటర్ వివరాలను పెమ్మసానికి వివరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఐటీ రంగంలో మరింత నైపుణ్యతతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ముదావహం అన్నారు.
సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి కంపెనీలలో ట్రైనింగ్ తీసుకుని వెళితే అమెరికాలో ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదని తెలిపారు. ఒక ప్లానింగ్ ప్రకారం మూడు నెలలకు ఒకసారి 50 మందికి ప్యాకెజీగా శిక్షణ అందిస్తారని అన్నారు. 50 మందితో ప్రారంభమైన ఈ ట్రైనింగ్ సెంటర్ 500 మందికి చేరాలని కోరుకుంటున్నాని తెలుపుతూ నిర్వహకులు వెంకట్ కు అభినందనలు తెలిపారు.













