Perni Nani: పేర్ని నానిని కాపాడుతున్నదెవరు..?
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యం (Ration Rice) మాయం వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. కాకినాడ పోర్టు (Kakinada Port) నుంచి పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని మొదటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) చెప్తూనే వస్తున్నారు. అందులో భాగంగా రేషన్ బియ్యంపై గట్టి నిఘా పెట్టింది ప్రభుత్వం. ఎక్కడికక్కడ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేకుండా పోయింది. ఆ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి (Perni Nani) చెందిన గోడౌన్లలో బియ్యం మాయమైనట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకూ పేర్ని నాని కుటుంబసభ్యులపై చర్యలు మాత్రం తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
వైసీపీ హయాంలో రేషన్ బియ్యం పెద్దఎత్తున విదేశాలకు తరలిపోతోందని.. దీని వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యంపై నిఘాపెట్టి గోడౌన్లు, స్టాక్ పాయింట్లను తనిఖీ చేపట్టింది. దీంతో పేర్ని నాని తన భార్య జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో బియ్యం తక్కువగా ఉన్నట్టు ప్రకటించారు. ఆ బియ్యం విలువెంతో చెప్తే ఆ డబ్బు చెల్లిస్తానన్నారు. దీంతో ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారులు కోటి 72 లక్షలు చెల్లించాలని చెప్పారు. దీంతో ఆ మొత్తాన్ని రెండు దఫాలుగా పేర్ని నాని చెల్లించేశారు. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ముగుస్తుందని అందరూ అనుకున్నారు.
పేర్ని నానికి జరిమానా విధించి కూటమి పెద్దలు, కొందరు అధికారులు కాపాడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన మంత్రులు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), కొల్లు రవీంద్ర (Kollu Ravindra).. మాయమైన బియ్యానికి డబ్బు చెల్లించినా చర్యలు ఉంటాలని వెల్లడించారు. దీంతో డిసెంబర్ 10న పేర్ని జయసుధ (Perni Jayasudha), గోడౌన్ ఇన్ ఛార్జ్ మానస్ తేజపైన (Manas Teja) పోలీసులు కేసు పెట్టారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం వీళ్లంతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ 24కు వాయిదా పడింది. కేసు నమోదైన తర్వాత మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన పేర్ని నాని తర్వాత రెండ్రోజులు ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. వైసీపీ నేతలతో భేటీ అయ్యారు.
అయితే పేర్ని నానిపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. బియ్యం మాయమైన కేసులో వివరాలు సమర్పించాలంటూ శనివారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. అధికారులు ఇంటికెళ్లిన సమయంలో పేర్ని నాని కుటుంబీకులెవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఆదివారం విచారణకు రావాలని కోరారు. అయితే ఆదివారం పేర్ని నాని, పేర్ని కిట్టు (Perni Kittu) సహా ఎవరూ పోలీస్ స్టేషన్ కు రాలేదు. దీంతో వారికి మరోసారి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే మొత్తం వ్యవహారం దాదాపు 20 రోజుల నుంచి జరుగుతున్నా ఇంతవరకూ పేర్ని నాని కుటుంబీకుల ఆచూకీ మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు. పేర్ని నాని రెండ్రోజులపాటు ఇంట్లోనే ఉన్నా అప్పుడు నోటీసులు ఇవ్వలేదు.. అరెస్టు చేయలేదు.. దీంతో ఈ వ్యవహారం వెనుక కొంతమంది పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.













