ఆ రెండు పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం.. రాష్ట్ర ప్రయోజనాలను
వైసీపీ, టీడీపీ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు సామాజిక కోణం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. బీజేపీ అభ్యర్థి గిరిజనురాలు కాబట్టి మద్దతు ఇస్తున్నామని చెప్పడం కేవలం సాకు మాత్రమే అని తెలిపారు. 2012లో జరిగిన 14వ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సంగ్మాల మధ్య పోటీ జరిగిందని, సంగ్మా మేఘాలయకు చెందిన గిరిజనుడని తలెఇపారు. ఆ ఎన్నికల్లో గిరిజనుడు అయిన సంగ్మాకు కాకుండా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. గిరిజనుడు అయిన సంగ్మాకు మద్దతు ఇవ్వకుండా టీడీపీ ఎన్నికలను బహిష్కరించిందన్నారు.
ఆనాడు ఆ రెండు పార్టీలు సామాజిక న్యాయం ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేసిన ధర్మ పోరాటం ఏమైందని నిలదీశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్న జగన్ గర్జనలు ఏమయ్యాయని అడిగారు. రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ అని, అటువంటి బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీ, టీడీపీలు మరింత ద్రోహులని మండిపడ్డారు. దుష్టత్రయ పార్టీలైన బీజేపీ, వైసీపీ, టీడీపీలను రాష్ట్ర పొలిమేర్ల నుండి తరిమికొడితే తప్ప రాష్ట్రం బాగుపడదని అన్నారు.













