ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో చూశా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలు నుంచి వచ్చిన సమయంలో ప్రజలు నీరాజనాలు పలికారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలు నమ్మారన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి వరకు సాగిన 14 గంటల ప్రయాణంలో అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారని, చరిత్రలో లేని విధంగా జనం వచ్చారని అన్నారు. చంద్రబాబు ఎక్కడా కారు దిగలేదన్నారు. ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో తాను చూశానని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తాము ముందే చెప్పామన్నారు. 50 రోజులకు పైగా చంద్రబాబును జైలులో ఉంచారని, 50 పైసలైనా ఆయనకు వచ్చాయని నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు. పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తే ఆరోపణలు నిజమవుతాయా? అని ఆయన మండిపడ్డారు.













