Payyavula Keshav: ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు.. మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడుల ప్రవాహాని కోసం శ్రమిస్తోంది. గత ఏడాది కాలంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు అనేక పథకాలను చేపట్టింది. అంతేకాక, దేశీయ, అంతర్జాతీయ స్థాయిల్లోని సంస్థలకు ఆహ్వానం పలికేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది.
అయితే ఇటీవలి రోజులుగా ప్రభుత్వంపై కావాలనే అవరోధాలు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అధికార పక్షం ఆరోపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకులు పెట్టుబడిదారులను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పటివరకు ఇవన్నీ ఆరోపణలుగానే కనిపించినా, తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) కొన్ని ఆధారాలను మీడియా ముందుంచి వివరణ ఇచ్చారు.
మంత్రి కేశవ్ చెప్పిన వివరాల ప్రకారం, రాష్ట్ర మైనింగ్ శాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం మొదలైందట. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు అడ్డుగానే ఈ చర్యలు పనిచేశాయని మంత్రి ఆరోపించారు. వైసీపీకి మద్దతు తెలిపే ఒక వ్యక్తి ఉదయ భాస్కర్ (Uday Bhaskar) పేరిట దాదాపు 200కి పైగా ఈ-మెయిళ్లు పంపించి, పెట్టుబడులను నిలిపివేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ చర్యల వల్ల సుమారు ₹9 వేల కోట్ల పెట్టుబడులు రాకుండా పోయాయని వివరించారు.
ఇంతటితో కాకుండా, వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వంపై నెగటివ్ ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులకు భయాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఉన్న ఈ-మెయిల్ సమాచారం ద్వారా కుట్రలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయని తెలిపారు. ఇది అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రయోజనాలకు హానికరమని పేర్కొంటూ, ఇటువంటి ప్రవర్తనను విడనాడాలని సూచించారు. అభివృద్ధిలో సహకరించాలని, అది కుదరకపోతే కనీసం అడ్డుపడకుండా ఉండాలని స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లోనూ పిటిషన్ల రూపంలో పెట్టుబడులను అడ్డుకోవడానికి వ్యవహరిస్తున్న వైసీపీ నాయకుల ప్రయత్నాలను తాము ఎదుర్కొంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుట్రలను భగ్నం చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.