ఇటు ఎంపీ ..అటు ఎమ్మెల్యే.. రెండు స్థానాలలో పోటీ చేయనున్న పవన్..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఇప్పటికే టీడీపీ -జనసేన పొత్తు ఖరారు కాగా.. ఇక బిజెపి కూడా ఈ కూటమిలో జాయిన్ అవ్వడానికి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న మంతనాలు సఫలం అయితే త్వరలోనే పొత్తు గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే తో పాటుగా ఎంపీగా కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి మెల్లిగా కేంద్రమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కూడా ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనమై కేంద్ర మంత్రిగా పదవిలో ఉన్నారు. ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు కూడా కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంకా ఈ విషయంపై జనసేన నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.













