ప్రధాని మోదీకి పవన్ అభినందనలు
మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రేడియో ద్వారా ప్రధాని ముచ్చటించే కార్యక్రమం అందరికీ చేరువైందని, 100 కోట్ల మంది విన్నారన్నారు. కార్యక్రమంలో సామాన్యుల విజయాలను ప్రస్తావిస్తూ ఎంతో స్ఫూర్తిని కలిగిస్తున్నారని కొనియాడారు. గొప్ప వ్యక్తులు, కళలు, చేతి వృత్తులు, సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇలా అనేక అంశాలపై చర్చించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రజలకు చేరువైందని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభ సందేశంలో సేవా పరమో ధర్మ, అన్న మాటలు మనసును హత్తుకునే విధంగా ఉంటాయని పేర్కొన్నారు. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరాటకంగా కొనసాగడం అభినందనీయమని కొనియాడారు. ప్రధానితో పాటు కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు.













