Pawan Kalyan: భూ దందాలపై పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
భూ దందాలు చేస్తే సహించేది లేదు… కూటమి పాలనలో ప్రజల ఆస్తులకు భరోసా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కార్యాలయానికి విశాఖ, కాకినాడ, కడప, తిరుపతి ప్రాంతాల నుంచి అర్జీలు రాగా.. వాటిపై అధికారులతో సమీక్ష జరపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలు కావచ్చు, వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు… వాటిని కాపాడుకోవడం కోసం సామాన్యులుపడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయని పవన్ పేర్కొన్నారు.
ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించే విధంగా చర్యలు ఉంటాయ స్పష్టం చేసారు. భూ దందాలు చేసినా, తప్పుడు దస్తావేజులు సృష్టించినా, కబ్జాలకు పాల్పడ్డా సహించేది లేదనే విషయాన్ని ఆ నేరాలకు పాల్పడేవారికి కఠినంగా తెలియచేయబోతున్నామన్నారు పవన్. కొద్ది రోజులుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి భూ కబ్జాలు, తప్పుడు రెవెన్యూ రికార్డుల ద్వారా ఆక్రమణలు చేస్తున్న విషయంపై పలు అర్జీలు రాగా.. వాటిపై శుక్రవారం సాయంత్రం తన కార్యాలయ అధికారులతో ఉప ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
గత ప్రభుత్వ హయాంలో పాలక పక్షానికి చెందినవారు చేసిన భూ దందాలు, ఆస్తులకు కోసం చేసిన బెదిరింపుల గురించీ, కూటమి పక్షాల పేరుతో ఆక్రమణలు చేసి వేధిస్తున్నవారి గురించీ ఫిర్యాదులు వచ్చాయి. కాకినాడ జిల్లా పరిధిలో గత పాలక పక్షానికి చెందిన నాయకుడు, అతని అనుచరులు బ్రాహ్మణుల ఆస్తులతోపాటు సత్రం భూములు, ఎండోమెంట్ ఆస్తులను కబ్జా చేయడం, కాకినాడ నగరంలో వ్యాపారులకు సంబంధించిన భవనాల స్వాధీనం కోసం బెదిరింపులకు దిగిన వైనాలు, తిరుపతి నగరంలో మఠం భూములను ఆక్రమించి గేట్లుపెట్టుకోవడం లాంటి అంశాలు ఈ ఫిర్యాదుల్లో ఉండగా.. పవన్ వాటిని పరిశీలించారు.
విశాఖ నగర శివార్లు, పారిశ్రామిక విస్తరణ ఉన్న ప్రాంతాల్లోని భూముల విషయంలో వివాదాలు సృష్టించడాన్ని కూడా పవన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ ఇస్తుందని.. గత పాలకులు ప్రజల ఆస్తులను వివాదాల్లోకి నెట్టి.. కబ్జాల చేసేలా చట్టాలే చేశారని.. వారి మద్దతుతో కొందరు దందాలు సాగించారని మండిపడ్డారు. ఆ తరహా అక్రమాలు చేసేవారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రజల నుంచి ఇప్పటికీ అలాంటి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా సరే ఉపేక్షించే సమస్యే లేదన్నారు.













