Pawan Kalyan – Varma: పవన్ కల్యాణ్ – వర్మ చెట్టపట్టాల్..! గ్యాప్ తొలగినట్లేనా…!?

పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ (SVSN Varma) మధ్య గత కొంతకాలంగా వస్తున్న విభేదాలు తలెత్తాయనే ఆరోపణలున్నాయి. టీడీపీ (TDP) కేడర్ కు, జనసైనికులకు (Janasena) మధ్య అక్కడ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. నాగబాబు (Nagababu) ఆ గ్యాప్ కు మరింత ఆజ్యం పోసేలా మాట్లాడారు. దీంటో టీడీపీ కేడర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. దీంతో పిఠాపురం లో టీడీపీ, జనసేన మధ్య వార్ పీక్ కు చేరిందని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా పిఠాపురంలో పవన్ కల్యాణ పర్యటన ఆ గ్యాప్ కు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది.
2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంలో వర్మ కీలక పాత్ర పోషించారు. టీడీపీ క్యాడర్‌ను సమన్వయం చేసి, కూటమి విజయానికి వర్మ తన వంతు సహకారం అందించారు. అయితే ఎన్నికల తర్వాత జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య కొన్ని చోట్ల సమన్వయ లోపం కనిపించింది. జనసేన నేత నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు, వర్మ వర్గంలో అసంతృప్తిని పెంచాయి. నాగబాబు వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించినవని, టీడీపీని తక్కువ చేసి చూపించేలా మాట్లాడారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. వర్మ కూడా సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పరోక్షంగా జనసేన నాయకత్వంపై విమర్శలు చేశారు. ఈ పరిణామాలతో ఇరు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్లు వార్తలు వచ్చాయి. కొందరు వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) వైపు వెళ్లే అవకాశం ఉందని, లేదా సొంత దారి చూసుకుంటారని ఊహాగానాలు చేశారు.
పిఠాపురంలో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలకు మరో కారణం పోలీసుల వైఖరి. కొందరు అధికారులు ‘ప్రోటోకాల్’ పేరుతో తనను, తన కార్యకర్తలను అడ్డుకున్నారని వర్మ ఆరోపించారు. అంబేడ్కర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో వర్మను లోపలికి రానివ్వలేదు. దీంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ సంఘటన వర్మ అనుచరుల్లో మరింత అసంతృప్తిని కలిగించింది. వర్మ ఈ విషయంపై హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే పవన్ కల్యాణ్ పిఠాపురంలో చేపట్టిన తాజా పర్యటన రాజకీయంగా కీలకమైనదిగా మారింది. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో వర్మను తన పక్కనే ఉంచుకుని, అతనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక సందర్భంలో, రిబ్బన్ కట్టింగ్ సమయంలో వర్మ చేయి దూరంగా ఉంచగా, పవన్ స్వయంగా అతని చేతిని దగ్గరకు లాగి పట్టుకున్నారు. ఇది రెండు పార్టీల్లోనూ సానుకూల సంకేతాలు ఇచ్చింది. పవన్ కల్యాణ్ వర్మను స్వయంగా ఆహ్వానించి, కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం పెంచే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పైగా నాగబాబు కామెంట్స్ పై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారని సమాచారం. జనసేన నేతలు, కార్యకర్తలు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దని, తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జనసేన-టీడీపీ కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటన సానుకూల చర్చకు దారితీసింది.