రేపటి నుంచి మళ్లీ జనంలోకి జనసేనాని..! విశాఖ నుంచి వారాహి యాత్ర..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ జనంబాట పడుతున్నారు. రేపటి నుంచి మూడో విడత వారాహి యాత్రను ఆయన ప్రారంభించబోతున్నారు. విశాఖ నుంచి ఈ యాత్రను చేపట్టాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. గత రెండు వారాహి యాత్రలు ఉభయ గోదావరి జిల్లాల్లో సాగాయి. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చిందని జనసైనికులు భావిస్తున్నారు. మూడో విడత యాత్రను గత రెండు యాత్రలకు మించి సక్సెస్ చేయాలని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉత్తరాంధ్ర నేతలకు సూచించారు. అందుకు తగ్గట్లే జనసేన నేతలు ఏర్పాట్లు చేశారు.
విశాఖ జగదాంబ సెంటర్ నుంచి రేపు పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంచి. 19 వరకూ ఈ యాత్ర కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ యాత్ర సాగేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే ఎక్కువగా విశాఖ, అనకాపల్లి జిల్లాలపైనే ఫోకస్ ఉంటుందని భావిస్తున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది వైసీపీ. త్వరలోనే దీన్ని అమలు చేస్తామని చెప్తోంది. దసరా తర్వాత జగన్ ఇక్కడకు మకాం మారుస్తారని చెప్తున్నారు. అందుకోసం రిషికొండలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అవుతుందని వైసీపీ చెప్తోంది.
అయితే ప్రశాంతంగా ఉండే విశాఖలో కూడా ఫ్యాక్షనిజం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారు. విశాఖలో వైసీపీ నేతల భూ దందాలు, అక్రమాలు ఎక్కువైపోయాయని ఆరోపించారు. రిషికొండను అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. మూడు నెలల కిందట పవన్ కల్యాణ్ రిషికొండకు వెళ్లి అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. ఇలాంటి అక్రమాలు ఉత్తరాంధ్ర మొత్తం జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ పదేపదే చెప్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలు కనుమరుగైపోతున్నాయని… అనకాపల్లి జిల్లాలో మైనింగ్ మాఫియా ఎక్కువైపోయిందని ప్రకటించారు. ఇటీవల పవన్ కల్యాణ్ వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు తగ్గట్టే పెందుర్తిలో ఓ వాలంటీర్ వృద్ధురాలిని హత్య చేసి దోచుకుపోయాడు. ఇలాంటి అంశాలన్నింటినీ పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో లేవనెత్తుతారని భావిస్తున్నారు.
వైసీపీని గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని పవన్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో కాస్త సాఫ్ట్ గా మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు దేనికైనా రెడీ అంటున్నారు. టీడీపీ నేతల కంటే ఎక్కువగా పవన్ గళమెత్తుతున్నారు. దీంతో వైసీపీ కూడా టీడీపీని వదిలేసి పవన్ కల్యాణ్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. గత రెండు వారాయి యాత్రలు పెద్ద సంచలనానికే దారితీశాయి. మరి ఇప్పుడు మూడో విడత యాత్ర ఇంకెన్ని సంచలనాలకు కారణమవుతుందో చూడాలి.













