అన్న బాటలో పవన్ కల్యాణ్..! తిరుపతి నుంచి పోటీ..!?
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీల హైకమాండ్ లిస్ట్ రెడీ చేస్తోంది. ఏపీలో వైసీపీ ఇప్పటికే ఆరు దఫాలుగా సమన్వయకర్తల జాబితాలు విడుదల చేసింది. టీడీపీ – జనసేన 99 మంది అభ్యర్థులను అనౌన్స్ చేశాయి. చంద్రబాబు కుప్పం నుంచి, పులివెందుల నుంచి జగన్ పోటీ చేయడం ఖాయమైంది. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కానీ ఆయన స్థానంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.
2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. అయితే ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. దీంతో ఆయన అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేకపోయారు. కానీ ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఉన్నారు జనసేనాని. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తనకు సేఫ్ సీటు కోసం అన్వేషణ ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి లేదంటే విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని జనసైనికులు సూచిస్తున్నారు.
భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖాయమని ఈమధ్య వార్తలు జోరందుకున్నాయి. లేదంటే పిఠాపురం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ రెండు సీట్లూ కాదని తిరుపతి నుంచి పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అన్నబాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
భీమవరం సీటును జనసేనకు కేటాయించడం దాదాపు ఖరారైంది. అయితే ఇక్కడ వైసీపీని ఓడించేందుకు గట్టి అభ్యర్థికోసం జనసేన వెతుకుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన త్వరలోనే జనసేన కండువా కప్పుకుంటారని సమాచారం. ఒకవేళ పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయకపోతే తనకు అవకాశం ఇవ్వాలని పులవర్తి రామాంజనేయులు కోరుతున్నారు. అయితే టీడీపీ – జనసేన అవగాహనలో భాగంగానే పులవర్తిని భీమవరం నుంచి బరిలో దింపుతున్నాయని సమాచారం. దీంతో పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.













