ఎంపీగా పవన్ కల్యాణ్ పోటీ..? ఏంటి స్కెచ్..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన పోటీ చేసే స్థానం కోసం అధికార వైసీపీ ఆతృతగా ఎదురుచూస్తోంది. గత ఎన్నికల్లో రెండు చోట్లా పవన్ కల్యాణ్ ను ఓడించింది వైసీపీ. అందుకే ఈసారి కూడా ఆయన ఎక్కడ పోటీ చేస్తారో చెప్తే దానికి అనుగుణంగా క్యాండిడేట్ ను డిసైడ్ చేసి బరిలోకి దింపాలనుకుంటోంది. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఈసారి కూడా రెండు చోట్ల నుంచి బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. కానీ ఈసారి రెండూ అసెంబ్లీ సీట్లు కాదు. ఒకటి పార్లమెంటు.. మరొకటి అసెంబ్లీ..!
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేశారు. గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసిన ఆయన .. రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేది ఇంకా తెలియట్లేదు. పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కొందరు.. తిరుపతి నుంచి బరిలోకి దిగుతారని కొందరు అనుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని ఏదైనా స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే జనసేన మాత్రం ఇప్పటికీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో కూడా ఆయన పేరు లేదు.
అయితే పవన్ కల్యాణ్ ఈసారి ఒక పార్లమెంటు స్థానం నుంచి మరో అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి పార్లమెంటుతో పాటు పిఠాపురం లేదా తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీగా ఎన్నికైతే కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే అవకాశం కలుగుతుందని.. తద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు చేయవచ్చనే ఉద్దేశంతో పవన్ అలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పవన్ ఎంపీగా పోటీ చేయాలని కోరినట్టు సమాచారం. బీజేపీ పెద్దల కోరికమేరకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే విమర్శలు వస్తాయనే భయం కూడా జనసేనను వెంటాడుతోంది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే పవన్ ఢిల్లీ వెళ్లి కూర్చుంటాడని.. రాష్ట్రాన్ని పార్టీని గాలికొదిలేస్తాడని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారు. వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ విషయంలో జనసేన నేతలు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు తర్వాత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు.. ఎన్ని చోట్ల బరిలోకి దిగుతారనేది క్లారిటీ రానుంది.













