టార్గెట్ వాలంటీర్లు..?
వాలంటీర్లు.. జగన్ సర్కార్ వచ్చిన తొలినాళ్లలోనే ఈ వ్యవస్థకు అంకురార్పణ చేశారు. అంతే కాదు.. వీరి ద్వారానే ప్రజాపంపిీణీ వ్యవస్థ నిర్వహణ జరుగుతోంది. గ్రామాల్లో ఏ పని జరగాలన్నా వాలంటీర్లు తప్పనిసరి. అదెంతవరకూ వచ్చిందంటే.. సాక్షాత్తూ వైసీపీ క్యాడర్ సైతం.. వాలంటీర్ల వ్యవస్థపై అసూయ చెందేస్థాయికి చేరింది. అయితే ఈవ్యవస్థ ఎంతవరకూ సేఫ్..? ప్రతీ ఇంటి వివరాలు.. వాలంటీర్ల నుంచి ఆన్ లైన్ లో అప్ లోడ్ జరుగుతున్నాయి. వాటికి రక్షణ ఏంటి? ఇవి సంఘ విద్రోహశక్తుల చేతికి చేరితే? వీటన్నింటికీ బాధ్యత ఎవరు తీసుకుంటారు?
గతంలో ఏపీ హైకోర్టు సైతం వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరి నియామకాలు చట్టపరంగా జరగలేదని స్పష్టం చేసింది..ప్రజాపంపిణీ వ్యవస్థలో వీరినెలా భాగస్వాములను చేస్తారని ప్రశ్నించింది . అంతేకాదు… వీరికి ప్రజల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసే బాధ్యత ఎలా అప్పగించారంది. వీటికి రక్షణ ఎలా సాధ్యమవుతుందో చెప్పాలంది. ఈ నియామకాలకు ఎలాంటి పరీక్షలు పెట్టారని ప్రశ్నించింది. మరోవైపు.. ఈసీ కూడా ఎన్నికల వ్యవహారాలకు.. వాలంటీర్లు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
అయినా సరే వాలంటీర్లు.. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తమపని తాము కానిచ్చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు నుంచి అన్ని అంశాల్లోనూ వేలు పెడుతున్నారు. అయితే కొన్నిచోట్ల వాలంటీర్లు… కుటుంబ వ్యవహారాల్లోనూ చోటు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పలు పోలీస్ స్టేష న్లలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడిదే అంశాన్ని పవన్ వారాహి -2లో టార్గెట్ చేశారు. అంతే కాదు వలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.
రాష్ట్రంలో వేల మంది మహిళలు, బాలికలు మాయం కావడం వెనక వాలంటీర్ల వ్యవస్థ హస్తముందన్నారు పవన్. ఇంటిలోని వివరాలతో పాటు వారి గురించి తెలుసుకున్న సమాచారాన్ని.. సంఘ విద్రోహశక్తులకు చేరుస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అంతే కాదు… వైసీపీ అంతర్భాగమే వలంటీర్ వ్యవస్థగా ఆరోపణలు చేశారు. పవన్ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తొలి విడత యాత్రలో జనసేన విధానాలపై మాట్లాడిన పవన్.. రెండో విడత యాత్రకు వచ్చేసరికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది.













