Lulu Mall: లులూ మాల్ పై పవన్ వ్యతిరేకత.. చంద్రబాబు క్లారిటీ…

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ సమావేశంలో ‘లులూ గ్రూప్’ (Lulu Group) పై తీవ్ర చర్చ జరిగింది. విజయవాడ (Vijayawada) సమీపంలోని మల్లవల్లి (Mallavalli) పారిశ్రామిక వాడలో మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ (Messrs Fair Exports) అనే లులూ సంస్థకు 7.8 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చ సాగింది. ఈ భూమిలో కోర్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే లులూ యాజమాన్యం ప్రణాళికను అధికారులు వివరించారు. అయితే ఈ అంశంపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనేక ప్రశ్నలు లేవనెత్తారు.
భూములు ప్రభుత్వంచే తీసుకున్న లులూ తిరిగి ప్రభుత్వానికే షరతులు పెట్టడం సరైనదేనా అని పవన్ అభిప్రాయపడ్డారు. వారు తీసుకునే భూమిలో నిజంగా ఏ విధమైన కార్యకలాపాలు జరగబోతున్నాయి అనే వివరాలు అడిగారు. “ఆహార ప్రాసెసింగ్” పేరుతో వేరే కార్యక్రమాలు జరిగితే అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. అక్కడ పండ్లు, కూరగాయలు ప్రాసెస్ చేస్తారా లేక మాంస ఉత్పత్తి కార్యకలాపాలా? గోవధ (cow slaughter) వంటి విషయాలు జరుగుతాయా అని పవన్ నేరుగా ప్రశ్నించారు. గోవధకు తాను పూర్తిగా వ్యతిరేకమని ఆయన స్పష్టంగా చెప్పారు.
అధికారుల సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జోక్యం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా గోవధ అనుమతించబడదని ఆయన స్పష్టం చేశారు. లులూ ఏర్పాటు చేయబోయే యూనిట్‌లో కేవలం మామిడి (mango), బొప్పాయి (papaya) వంటి పండ్ల ప్రాసెసింగ్‌కే అనుమతి ఇవ్వాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌తో పాటు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) కూడా లులూ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు. లీజు రేటు పెంపుపై కూడా చర్చ జరిగింది. సాధారణంగా మూడేళ్లకొకసారి 10 శాతం లీజు పెంచాలి. కానీ లులూ ప్రతిపాదన ప్రకారం ఐదేళ్లకు 5 శాతం మాత్రమే పెంచాలని చెప్పారు. దీనిపై మనోహర్ ప్రశ్నించగా అధికారులు లులూ నుంచి పెద్ద పెట్టుబడులు వస్తాయని, స్థానికులకు ఉపాధి కల్పిస్తారని వివరణ ఇచ్చారు.
అయితే పవన్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “తమ మాల్స్‌లో (Malls) లులూ అద్దెలు మూడేళ్లకొకసారి పెంచుతుందా? పదేళ్లకోసారి పెంచుతుందా?” అంటూ ప్రశ్నించారు. “ప్రభుత్వానికి మాత్రం వేరే నిబంధనలు ఎందుకు?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా లులూ మాల్స్‌లో స్థానికులకు ఉపాధి ఇవ్వకపోవడం సరైంది కాదని పేర్కొన్నారు. భూములు కేటాయించినప్పుడు స్థానికులకు తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ చర్చలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లులూను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. కానీ వారి షరతులు ఆమోదయోగ్యమా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తామని అన్నారు. ప్రజలకు మేలు చేసే విధంగానే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చివరగా సీఎం జోక్యంతో ఈ చర్చ ముగిసినట్లు సమాచారం.