విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం.. డిజిటల్ క్యాంపెయిన్ : పవన్ కల్యాణ్
విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పలేకపోయారని, పైగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజటల్ క్యాంపెయిన్ సాగిద్దామన్నారు.
వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించాలని కోరుతూ లోకసభ, రాజ్యసభ సభ్యులను సామాజిక మాద్యమాల ద్వారా విజ్ఞప్తి చేదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు 18వ తేదీ ఉదయం 10 గంటలకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎంపీలను ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.













