బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిన పవన్ కల్యాణ్
తిరుపతి పార్లమెంటు సెగ్మెంటులో గెలుపుకోసం బీజేపీ-జనసేన పార్టీలు తమ శక్తినంతటినీ ధారపోస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ నేతలు సైతం ఈ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సైతం ఈ ఉపఎన్నిక ప్రచారానికి వస్తున్నారంటూ దీన్ని ఆ పార్టీ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ పార్టీ రేపు తలపెట్టిన బహిరంగసభకు మిత్రపక్ష పార్టీ అధినేత, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కావడం డౌట్ గానే ఉంది. ఇది బీజేపీకి పెద్ద ఇబ్బందికరంగా మారింది.
పవన్ కల్యాణ్ కున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇప్పటికే ఓసారి తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. పాదయాత్ర అనంతరం చిన్న బహిరంగసభలో మాట్లాడారు. ఆ బహిరంగసభ మొత్తం పవన్ చుట్టూనే తిరిగింది. ఆ సభలో మిగిలిన వాళ్ల ప్రసంగాల కంటే పవన్ కల్యాణ్ స్పీచే హైలైట్ గా నిలిచింది. ఆ సభలో పవన్ మాట్లాడిన దానిపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతల మాటలను ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్యపై పవన్ చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి. బీజేపీకి కూడా బాగా ఊపొచ్చింది.
దీంతో పవన్ కల్యాణ్ ను పోలింగ్ లోపు మళ్లీ ఒకసారి ప్రచారానికి తీసుకొచ్చి క్యాష్ చేసుకోవాలని బీజేపీ నేతలు భావించారు. ఇందుకోసం 12వ తేదీని ఎంచుకున్నారు. రేపు రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకూ ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత నాయుడుపేటలో బహిరంగసభ జరపాలని డిసైడ్ చేసారు. ఇందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటున్నారు. ఇద్దు అగ్రనేతలు పాల్గొంటే పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహం వస్తుందని భావించారు. అయితే ఇవాళ పవన్ కల్యాణ్ బాంబు పేల్చారు. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందిలో పలువురికి కరోనా సోకడంతో తాను ఐసోలేషన్ లో ఉంటున్నట్టు ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ప్రకటన బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఒక విధంగా చెప్పాలంటే తిరుపతి ఉపఎన్నికల్లో పవన్ నే ఎక్కువగా నమ్ముకుంది బీజేపీ. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాలేకపోవచ్చనే వార్త ఆ పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే తిరుపతిలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోతుందని అంచనాలు వస్తున్నాయి. పైగా బీజేపీ నోటాతో పోటీ పడుతుందని వైసీపీ నేతలు మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా హ్యాండిస్తే .. పార్టీ మరింత దిగజారుతుందనే భయం కమలం నేతలకు పట్టుకుంది. మరి ఈ పరిస్థితి నుంచి వాళ్లు ఎలా గట్టెక్కుతారనేది చూడాలి.













