అధికారం ఒక్కరే చెలాయిస్తారు కానీ రాజధానులు మూడు కావాలా?.. ఏపీ ప్రభుత్వానికి పవన్ సూటి ప్రశ్న
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై వైసీపీకి నిజంగానే అంత ప్రేమ ఉందా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సీమ నుంచి సీఎంలు వచ్చినా ఆ ప్రాంతం మాత్రం ఇంకా వెనుకబడే ఉందని విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణ కావాలి అంటున్నారని, కానీ అధికార వికేంద్రీకరణకు మాత్రం ఒప్పుకోరని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం నుంచి ఎన్నో సంస్థలు వెళ్లిపోయాయని పవన్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక్కరు తీసుకునే నిర్ణయాల వల్లనే ఇలా అందరికీ ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. అంటే అధికారం ఒక్కరే చెలాయించాలి కానీ.. రాజధానులు మాత్రం మూడు కావాలంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర నేతలు వెనుకబడి లేరని, అక్కడి ప్రజలు మాత్రమే కష్టాల్లో ఉన్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణ ఎక్కడుందో చెప్పాలని అడిగారు. ఏపీ పోలీసుల తీరుపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాము గొడవలు పెట్టుకోలేక కాదని, కేవలం పోలీసులపై ఉన్న గౌరవంతోనే మౌనంగా ఉన్నామని చెప్పారు. వైసీపీ బెదిరింపులు తమకేం కొత్త కాదన్న ఆయన.. ఇలాంటి ఉడత ఊపులకు తాను భయపడనని స్పష్టం చేశారు.













