ఆ పార్టీలకు చిత్తశుద్ధి లేదు : పవన్
విభజన సమస్యలపై అధికారపార్టీ టీడీపీ, ప్రతిపక్షపార్టీ వైసీపీ చిత్తశుద్ధితో పోరాటం చేయడం లేదని అందుకే వామపక్షాలతో కలిసి జనసేన పార్టీ ముందుకు వెళుతోందని పవన్ కల్యాణ్ సృష్టం చేశారు. విజయవాడ బెంజి సర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా రామవరప్పాడు వరకు సాగే యాత్రలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందన్నారు.
అఖిలపక్ష సమావేశంతో లాభమేంటి అని ప్రశ్నించారు. కొన్ని ఒత్తిళ్లవల్ల ఆ రెండు పార్టీలు హోదా కోసం పోరాటం చేయలేకపోయాయని అన్నారు. కేంద్రంపై ఎవరూ మాట్లాడలేకపోవడం వల్లే తాము మాట్లాడవలసి వచ్చిందని అన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ సరిగా పోరాడలేదని, టీడీపీ, వైసీపీ పోరాటలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. వామపక్షాలతో కలిసి హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సృష్టం చేశారు. అధికారపార్టీ ఏడాది ముందు అఖిలపక్ష భేటీ నిర్వహించి ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి ప్రాయోజనం ఉండదన్నారు. ఉద్యమ కార్యాచరణపై పార్టీల నేతలతో మంత్రులు చర్చించాలని పవన్ సూచించారు.













