ఎస్సీ, ఎస్టీ నిధుల కోసం పోరాడాలి: పవన్ కల్యాణ్
తమకు కావలసిన నిధుల కోసం దేహీ అనకూడదని, పోరాడి వాటిని సాధించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనిలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. వ్యక్తి ఆరాధన చాలా ప్రమాదకరమని చెప్పారు. “వివక్షకు గురైన కులాలను అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్ష ఎదుర్కొంటాడు. అప్పుడే వివక్ష ఎలా ఉంటుందో తెలుస్తుంది. సమాజాన్ని సమగ్రంగా చూడాలి. కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. జనాభాకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు జరగాలి కదా. దాదాపు 22 శాతం జనాభా ఉన్నా కూడా నిధుల కోసం దేహి అనాలా? పోరాటం చేసే సాధించుకోవాలి’ అని పవన్ స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లకూడదని, బయటి శత్రువుల కన్నా మనతో ఉండే శత్రువులే ఎక్కువ ప్రమాదమని అన్నారు. హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు. ‘సామాజిక పునర్నిర్మాణం చేయాలనేదే నా తపన. నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారంటే చాలా బాధగా ఉంది. మూడేళ్లలో రూ.20 వేల కోట్లు లబ్దిదారులకు దక్కకుండా చేశారంటే ఏమనాలి? ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా.. వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏంటి?’ అని పవన్ మండిపడ్డారు.












