చిక్కుల్లో పవన్ కల్యాణ్..! ఫ్యూచర్ ప్లాన్ ఏంటి?
పవన్ కల్యాణ్ కు ఊహించని చిక్కు వచ్చి పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కల్యాణ్. దీన్ని ప్రైవేటీకరించబోతున్నారనే విషయం తెలియగానే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. దీన్ని ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఇది ఏర్పడిందని.. ప్రజల సెంటిమెంట్ అని గుర్తు చేసి వచ్చారు. అయితే ఇప్పుడు పవన్ మాటను కేంద్రం ఏమాత్రం పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. దీంతో పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100 శాతం ప్రైవేటీకరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. లోక్ సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విస్పష్టమైన సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదనే స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యాపారాలు చేయాలనుకోవట్లేదని తేల్చేశారు. దీంతో రాష్ట్ర బీజేపీకి, దాంతో కలిసి నడుస్తున్న జనసేనకు ఇది పెద్ద సమస్యగా మారింది. కేంద్రాన్ని కాదని రాష్ట్ర బీజేపీ ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. అధిష్టానం చెప్పినట్లే నడుచుకోవాల్సి ఉంటుంది.
కానీ జనసేన సంగతి వేరు. విశాఖ స్టీల ప్లాంట్ నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో పవన్ కల్యాణ్ ఏం చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీ క్లారిటీ ఇచ్చేసిన తర్వాత కూడా ఆ పార్టీతోనే కలిసి నడుస్తారా.. లేదంటే బయటికొస్తారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీతో కలిసి నడిస్తే జనసేనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. స్టీల్ ప్లాంట్ కోసం బీజేపీతో కటీఫ్ చెప్పి బయటికొస్తే మాత్రం జనసేనను జనం ఆదరిస్తారు. కానీ ఆ పని పవన్ కల్యాణ్ చేస్తారా.. అనేది డౌటే.
పవన్ కల్యాణ్ కున్న క్రేజ్ ఏంటో అందరికి తెలుసు. అందుకే జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోయినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతుంటాయి. పవన్ కల్యాణ్ కు అందుకే డిమాండ్. పవన్ కల్యాణ్ కూడా సమస్యలపై స్పందించడంలో ముందుంటారు. తాను ఎక్కడున్నా సమస్యపై మాత్రం సూటిగా స్పందిస్తుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తన పార్టీ స్టాండ్ ఏంటో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇది సరిపోదు. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని తాను గట్టిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పాలంటే ఆపార్టీతో తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ పార్టీకి చిక్కులు తప్పకపోవచ్చు. మరి పవన్ ఏం చేస్తారో చూద్దాం..













