Pawan Kalyan: మీ యాటిట్యూడ్ మారాలి: పవన్ వార్నింగ్
తిరుమలలో (Tirumala) జరిగిన వ్యవహారంపై డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్(Pawan kalian) సీరియస్ అయ్యారు. టీటీడీ అధికారుల తీరుపై పవన్ మండిపడ్డారు. అధికారుల యాటిట్యూడ్ అసలు మారలేదు అంటూ కడిగిపారేశారు. శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం నిందలు మోస్తోందన్నారు. పోలీసులు క్రౌడ్ మేనేజింగ్ చేయడంలో విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేసారు. తప్పు జరిగింది, పూర్తి బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు.
తొక్కిసలాట జరిగినప్పుడు హెల్ప్ చేసిన పోలీసులు ఉన్నారని… అలాగే చోద్యం చూసిన పోలీసులు ఉన్నారు.. పోలీసుల్లో కొందరు కావాలనే వ్యవహరించినట్టు బాధితులు చెప్పారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని పవన్ ఆకాంక్షించారు. టీటీడీ ఈవో, ఏఈవోకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వీఐపీ యాటిట్యూడ్ మానేయండి అంటూ ఘాటుగా చెప్పారు పవన్. టీటీడీ ఈవోకు, అడిషనల్ ఈవోకు మధ్య గ్యాప్ ఉందని అన్నారు పవన్.
టీటీడీ బోర్డు మెంబర్లు.. చనిపోయినవారి ఇళ్లకు వెళ్లి క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. టీటీడీలో ప్రక్షాళన జరగాలి.. వీఐపీలను కాదు.. సామాన్యుల దర్శనాలపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేసారు. అటు అభిమానుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను బాధితులను పరామర్శించడానికి వస్తే ఈ గోల ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేసారు పవన్. ఇక అధికారులపై సిఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేసారు.
తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీఎస్వో శ్రీధర్ బదిలీ చేసారు. తిరుపతి ఘటనపై జ్యుడిషియల్ విచారణకు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రమాద ఘటనకు కారకులపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేస్తున్నామన్నారు. బాధితులకు అండగా ఉంటామని.. తొక్కిసలాట లో మృతి చెందిన 6 గురిని గుర్తించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలకు నష్ట పరిహారం ఇస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తామన్నారు.













