పవన్ తో ఉండవల్లి భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. పవన్ ఏర్పాటు చేయనున్న జేఎఫ్‌సీపై చర్చించారు. వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన హామీల సాధనకు జేఏసీని ఏర్పాటుచేస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరకు జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీ(జేఎఫ్సీ)ని తెరమీదకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే లోక్‌సత్తా వ్యవస్తాపకులు జయప్రకాశ్ నారాయణతో చర్చలు జరిపిన పవన్ తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఇదిలావుంటే ఏపీకి నిధుల విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల్లో నిజానిజాలు తేల్చేదుకు జేఎఫ్సి కమిటీ పనిచేయనుంది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చాలా నిధులు ఇచ్చామని మోదీ సర్కార్ చెబుతోంది. విభజన చట్ట ప్రకారం ఇవ్వాల్సినవేవీ ఇవ్వలేదని, చాలా నిధులు ఎక్కడినుంచి ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దీంతో కేంద్రం నెరవేరుస్తున్న హామీలేంటి, అందుకోసం ఇచ్చిన నిధులు ఎన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత, రాష్ట్ర ప్రభుత్వ వాదనలో నిజమెంత, అన్నదానిపై కూలంకశంగా అధ్యయనం చేయడానికి పవన్ శ్రీకారం చుట్టారు.













